న్యూఢిల్లీ, మే 7: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు, భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట మాక్ డ్రిల్లు నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన కొన్ని గంటలకే మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి.
ఢిల్లీలో 55 ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు. నగరమంతటా పోలీసు వాహనాలు, అగ్నిమాపక శకటాలను మోహరించారు. డ్రిల్ ప్రారంభం కాగానే సైరన్లు మోగాయి, వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గాయపడిన వారిని స్ట్రెచర్ల మీద దవాఖానలకు తరలించారు. ఇక పలు బహుళ అంతస్తుల భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళాలు క్రేన్లను ఉపయోగించాయి.
ఘటనా స్థలాలకు డాక్టర్లు, అంబులెన్స్‌లు పరుగులు తీశాయి. సైరన్ మోగగానే కార్యాలయాల్లో ఉద్యోగులు విద్యుత్తు పరికరాలను ఆపివేసి డెస్క్‌ల కింద చేరి దాక్కున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రదేశాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నిత ప్రాంతాలైన అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, రిఫైనరీలు, జలవిద్యుత్తు కేంద్రాలకు పూర్తి భద్రత కల్పించారు. రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) వేర్వేరుగా, సంయుక్తంగా ఈ డ్రిల్స్ చేపట్టాయి. ప్రమాద స్థలి నుంచి ప్రజలను కాపాడే ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ దళాలు కూడా తమ పాత్ర పోషించాయి.