Medical Students | న్యూఢిల్లీ, ఆగస్టు 15: వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో చిత్తవుతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నివేదిక పేర్కొన్నది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపింది. ఎన్ఎంసీ ఏర్పాటుచేసిన ‘నేషనల్ టాస్క్ఫోర్స్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్’ వైద్య విద్యార్థులపై ఏప్రిల్ 26 నుంచి మే 6 వరకు ఒక ఆన్లైన్ సర్వే నిర్వహించింది.
ఇందులో 25,590 మంది అండర్ గ్రాడ్యుయేట్, 5,337 మంది పీజీ వైద్య వైద్యార్థులు, 7,035 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. యూజీ విద్యార్థుల్లో 27.8 శాతం, పీజీ విద్యార్థుల్లో 15.3 శాతం మంది తాము మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు స్వచ్ఛందంగా తెలిపారని ఈ నివేదిక పేర్కొన్నది.
యూజీ విద్యార్థుల్లో 16.2 శాతం మంది, పీజీ విద్యార్థులు 31.2 శాతం మందికి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది. గత ఏడాదిలో 564 మంది పీజీ విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నామని, 237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నించామని సైతం సర్వేలో ఒప్పుకున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిలో కొంద రు మానసిక వైద్య సహాయాన్ని ఆశిస్తుండగా, ఇంకొందరు వద్దనుకుంటున్నారు.