న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా పాకిస్థాన్‌పై భారత్ సైనిక దాడి జరపవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ మంగళవారం సమావేశమయ్యారు. గడచిన 48 గంటల్లో ధోవల్ ప్రధానితో భేటీ కావడం ఇది రెండవసారి. 1971 తర్వాత మొట్టమొదటిసారి బుధవారం దేశవ్యాప్తంగా మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశించిన నేపథ్యంలో వీరిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గడచిన రెండు మూడు రోజులలో ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ రంగానికి సంబంధించిన కీలక వ్యక్తులతో వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల ప్రధానాధికారులతో ఆయన చర్చలు జరిపారు. గత వారం ధోవల్, జనరల్ చౌహాన్‌తో సమావేశమైన ప్రధాని మోదీ పాక్‌పై సైనిక చర్యకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను సాయుధ దళాలకే వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు.