న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ సీట్ల విస్తరణ పరిమితిపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) కీలక విధాన మార్పును ప్రకటించింది. సీట్ల సంఖ్యను తగినంతగా పెంచుకొనేందుకు అనుమతినిస్తూ ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కొత్త కళాశాలలు, ఇప్పటికే ఉన్న కోర్సుల విస్తరణపై 2023 నాటి నిబంధనలను సవరించింది.
తాజా సవరణల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కళాశాల 150 ఎంబీబీఎస్ సీట్లు కలిగి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ప్రతి 10 లక్షల జనాభాకూ 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలన్న నిష్పత్తి నిబంధనను తొలగించారు. దేశంలో డాక్టర్ల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.