న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ.88 లక్షలు) పెంచుతూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్య భారతదేశ టెక్నాలజీ సర్వీసు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారతీయ టెక్ పరిశ్రమల జాతీయ సంఘం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) తెలిపింది. ట్రంప్ నిర్ణయం వల్ల దేశీయంగా జరిగే ప్రాజెక్టులకు వ్యాపార కొనసాగింపునకు అవరోధాలు ఏర్పడగలవని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రంప్ ప్రభుత్వం కొత్త నిర్ణయం అమలుకు విధించిన సెప్టెంబర్ 21వ తేదీ గడువుపై సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాపారాలు, వృత్తి నిపుణులు, విద్యార్థులకు ఒకరోజు గడువు అస్థిరతను సృష్టించగలదని నాస్కామ్ పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలను తాము లోతుగా పరిశీలిస్తున్నామని, ఏదేమైనా ఈ చర్య అమెరికా ఆవిష్కరణల వాతావరణం, ఉద్యోగ వ్యవస్థపై దుష్ప్రభావం చూపగలదని అభిప్రాయపడింది.