Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట దక్కింది. పరువు నష్టం కేసులో ఆయనకు నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హిందుత్వ సిద్ధాంకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నాసిక్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ వీడియో లింక్ ద్వారా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్ సీ నర్వాడియా ఎదుట హాజరై తాను నిర్దోషినని తెలిపారు. రూ.15వేల బాండ్‌ను సమర్పించడంతో బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాదులు తెలిపారు. 2022 నవంబర్ భారత్ జోడోయాత్ర సందర్భంగా హింగోలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సావర్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని దేవేంద్ర భూటాడా ఆరోపించారు. రాహుల్ ప్రసంగం పిటిషన్ ఆరాధ్యదైవం, స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు.