PM Modi | న్యూఢిల్లీ, జూన్ 8: ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్, సెషెల్స్తో పాటు మాల్దీవ్స్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మోదీ క్యాబినెట్లో 27-30 మంది ఉండే అవకాశం ఉంది.
మంత్రివర్గ కూర్పుపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. ప్రతి నలుగురైదురుగు ఎంపీలకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయిస్తామని, ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీకి సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఆదివారం ఉదయానికి మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే అంశంపై స్పష్టత రానుంది.