న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల వ్యవధిలోనే త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల 8న, 9న రాత్రి వేళల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు, జమ్ము, కశ్మీర్లోని పలు నగరాలపై డ్రోన్ దాడి యత్నాలు, దేశ పశ్చిమ సరిహద్దులో సైన్యం సన్నద్ధతపై చర్చించారు. మాజీ త్రివిధ దళాల అధికారులతోనూ మోదీ సమావేశమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్-పా క్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో తాజా పరిస్థితులపై శుక్రవారం వారితో చర్చించినట్టు చెప్పారు. మరోవైపు పాక్ చొరబాట్ల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా సమీక్ష నిర్వహించారు.
దేశంలోని సైనిక స్థావరాలపై దాడులకు పాక్ యత్నించిన మరుసటి రోజైన శుక్రవారం నాడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో దేశ భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ చీఫ్లు, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కు మార్ సింగ్ సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలోని వైద్య సదుపాయాల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్-పాక్ సైన్యాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ సమావేశం నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి.
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బ్యాంకులకు సూచించారు.