Narendra Modi : పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఖండించారు. లాక్డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించిన మోడీ ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వ్యాపార స్థిరత్వం, ఇంధన భద్రతపై ఎల్జీ, సీఎంలకు కీలక సూచనలు చేసిన ప్రధాని టీమిండియాగా పనిచేసి ఈ గడ్డు కాలాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు.
నాలుగు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో భారత దేశంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కరోనా కాలంలో మాదిరిగానే ఈ కఠినమైన పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా పనిచేస్తూ అధిగమిద్దామని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.
PM Narendra Modi reviews West Asia crisis with CMs via video conference
AP CM N Chandrababu Naidu and Telangana CM A Revanth Reddy attend high-level meet pic.twitter.com/S8xBhCnaVF
— Telugu360 (@Telugu360) March 27, 2026
గ్యాస్, పెట్రోల్, ఎరువుల సరఫారాపై ఆరా తీసిన ప్రధాని పరస్పర సహకారం, సత్వర స్పందనతో వ్యవహరించాలని కోరారు. మార్చి ఆరంభం నుంచి యుద్ధం పర్యావసానాలను మంత్రుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పిన ప్రధాని ఈ సమయంలో ఆర్ధిక, వాణిజ్య స్థిరత్వం.. ఇంధన భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ పౌరుల ప్రయోజనాలను కాపాడడం, పరిశ్రమలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని సీఎంలకు ప్రధాని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళికల అవసరం ఉందని చెప్పిన మోడీ ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత ఏర్పడకుండా చూడాలని తెలిపారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించారు. తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రధాని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వందతులపై అప్రమత్తంగా ఉండాలని మోడీ తెలిపారు.
ఆన్లైన్ మోసాలు, తప్పుడు, నకిలీ ఏజెంట్ల మీద నిఘా పెట్టాలని సీఎంలకు మోదీ సూచించారు. రెండుగంటలకు పైగా జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎన్నికలు లేని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.