బెంగళూరు, జూన్ 25: పాల ధరలను పెంచుతున్నట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మంగళవారం ప్రకటించింది. లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున పెంచుతున్నామని, పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నది. ధర పెంపునకు అనుగుణంగా ప్యాకెట్లో పాల పరిణామాన్ని కూడా 50 మిల్లీలీటర్ల చొప్పున పెంచుతామని కేఎంఎఫ్ వెల్లడించింది.
ప్రస్తుత సీజన్లో అన్ని జిల్లా మిల్క్ యూనియన్లలో పాల నిల్వ ప్రతి రోజూ పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో లీటర్, అరలీటర్ ప్యాకెట్లకు అదనంగా 50 మిల్లీలీటర్ల పరిణామాన్ని జోడించి రూ.2 చొప్పన పెంచుతున్నామని పేర్కొన్నది. తాజా సవరణతో 500 మిల్లీలీటర్ల నందిని టోనుడ్ పాల ప్యాకెట్ రూ.22 ఉండగా, అది 550 మిల్లీలీటర్లకు పెరిగి రూ.24 అవుతుందని, అదేవిధంగా రూ.42 ఉండే లీటర్ ప్యాకెట్.. 1050 మిల్లీలీటర్లకు పెరిగి, ధర రూ.44 అవుతుందని వివరించింది. అలాగే అలాగే నందిని బ్రాండ్ ఇతర పాల ఉత్పత్తుల్లోనూ పెరుగుదల ఉంటుందని తెలిపింది.
పాల పెంపు అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై పన్నుల పెంపుతో ధరలను పెంచిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. సామాన్యుల జేబుకు చిల్లు పెట్టే పని పెట్టుకొన్నదని విపక్షాలు విమర్శించాయి. ధరల పెంపునకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ బాధ్యత వహించాలని పేర్కొనగా.. కేఎంఎఫ్ స్వతంత్ర సంస్థ అని, ధరల పెంపుతో తమకు సంబంధం లేదని సిద్ధరామయ్య సర్కార్ వాదించింది.
‘ఎమర్జెన్సీ’ గోల్డెన్ జూబ్లీ పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బంపర్ గిఫ్ట్ ఇచ్చిందంటూ జేడీఎస్ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన గ్యారెంటీ స్కీమ్స్ వల్లే ధరలు పెరుగుతున్నాయని ‘ఎక్స్’ సందేశాన్ని పోస్ట్ చేసింది. కేవలం 13 నెలల వ్యవధిలో రెండుసార్లు పాల ధరల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని బీజేపీ ఆరోపించింది. విపక్షాల విమర్శలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ‘నందిని పాల ధరలో ఎలాంటి మార్పు లేదని, ధర పెంపునకు అనుగుణంగా ప్రతి ప్యాకెట్లో 50 మిల్లీలీటర్లు అదనంగా చేరుస్తున్నారని పేర్కొన్నారు.