చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్.. వెల్లూర్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ.. 32 ఏండ్ల పాటు తనకు అండగా నిలిచిన తమిళ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నళిని పేర్కొన్నారు. మిగతా విషయాలన్ని రేపు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతానని తెలిపారు. సుప్రీంకోర్టు లాయర్లు కూడా మాట్లాడే అవకాశం ఉందన్నారు.
అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత శనివారం సాయంత్రం జైలు అధికారులు నళినిని విడుదల చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనును విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నళిని, రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ పూర్తిచేసిన తర్వాత కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో నళిని, శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. గత మే 18న పెరారివాళన్ పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ క్రమంలో నళిని, రవిచంద్రన్‌ల పిటిషన్‌పై విచారణ అనంతరం వారి విడుదలకు ఇచ్చిన తీర్పే ఆరుగురికి వర్తిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. జైలులో నిందితుల ప్రవర్తన సరిగా ఉండటంతో విడుదల చేయాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించారు. ఆయనతోపాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.