తిరువనంతపురం: మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. (drone over women’s jail) దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని కన్నూర్‌లో ఈ సంఘటన జరిగింది. జిల్లా జైలు, ప్రత్యేక సబ్ జైలు వెనుక మహిళా జైలు ఉన్నది. ఈ జైలు చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి.
కాగా, మార్చి 1న రాత్రి 11.15 గంటల సమయంలో మహిళా ఖైదీలున్న జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. 25 మీటర్ల ఎత్తులో రెండుసార్లు అక్కడ తిరిగింది. డ్రోన్ ఎగరడాన్ని జైలు సిబ్బంది గమనించారు. జైలు సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ డ్రోన్‌ను ఎవరు ఎగురవేశారు?, ఎందుకు ఎగురవేశారు? ఏదైనా భద్రతా ముప్పు పొంచి ఉన్నదా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.