Mysterious Drone | కోల్‌కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్రోన్ల గురించి ఎలాంటి సమాచారం అందలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత డ్రోన్లు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ల గురించి అనేక ఊహాగానాలున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి కోల్‌కతాలోని అనేక ప్రాంతాల్లో ఈ డ్రోన్లు తిరుగుతున్నట్లు కనిపించాయి.
విక్టోరియా మెమోరియల్ నుంచి బ్రిగేడ్ గ్రౌండ్ వరకు డ్రోన్లు ఆకాశంలో కనిపించాయి. ఈ సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రోన్ల గురించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. మరో వైపు భారత సైన్యం దీన్ని ధ్రువీకరించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. డ్రోన్లు విజయ్ దుర్గ్ (గతంలో ఫోర్ట్ విలియం) చుట్టూ డ్రోన్లు కనిపించాయి. ఫోర్ట్ విలియం సైనిక ప్రాంతం కావడంతో దాన్ని ‘రెడ్ జోన్’గా గుర్తించారు. డ్రోన్లు తదితర ఎగిరే పరికరాలపై కఠినమైన నిషేధం అమలులో ఉంది. అందుకే సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించడంతో కలకలం రేగింది. ఫోర్ట్ విలియం, విక్టోరియా మైదాన్ ప్రాంతాలపై రాత్రి 9.45 నుంచి రాత్రి 10.30 గంటల మధ్య దాదాపు ఎనిమిది నుంచి పది డ్రోన్లు సంచరించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ డ్రోన్లు మహేస్థల, బెహాలా నుంచి వచ్చాయని పలువురు చెబుతున్నారు. డ్రోన్లను అనేక అవసరాల కోసం ఎగురవేస్తున్నారని.. సోమవారం రాత్రి ఎగిరిన డ్రోన్లు ఎక్కడ ఉన్నాయనేది పెద్ద ప్రశ్నగా మారిందని పోలీసులు వర్గాలు పేర్కొంటున్నాయి. డ్రోన్లు మాత్రం మహేస్థల నుంచి ఎగురుతున్నట్లుగా కనిపించాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు, సైన్యానికి సైతం సమాచారం అందించారు. కేవలం ఊహాగానాలు కావొచ్చని.. ప్రస్తుతం ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని భారత సైన్యం తెలిపింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. కోల్‌కతాపై డ్రోన్లు కనిపించాయనే నివేదికలు అందాయని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో మీడియా ఊహాగానాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.