న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. కృత్రిమ మేధ, హైపర్సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతోసహా కీలకమైన సైనిక టెక్నాలజీలపై చైనా నుంచి అమెరికా వరకు పనిచేస్తున్న నిపుణులు అనుమానాస్పద లేదా వివరించలేని పరిస్థితులలో మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనలు వేర్వేరు విషాదాలా లేక ఇదొక పెద్ద సమన్వయంతో కూడిన ప్రణాళికలో భాగమా అనే దానిపై విస్తృత చర్చకు దారితీశాయి. వాషింగ్టన్లో అణు సాంకేతికత, అధునాతన ఆయుధాలు, అంతరిక్ష పరిశోధన వంటి కీలకమైన రంగాలతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలకు సంబంధించిన కనీసం 11 కేసులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశం రాజకీయ దృష్టిని ఆకర్షించింది.
రిపబ్లికన్ ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ ఇందులో విదేశీ జోక్యం ఉండే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. అణు సాంకేతికత, అధునాతన ఆయుధాలు, అంతరిక్ష రంగాల్లో మనం చైనా, రష్యా, ఇరాన్‌లతో పోటీ పడుతున్నాము. ఇదిలా ఉంటే మన ఉన్నతశ్రేణి శాస్త్రవేత్తలు అదృశ్యమైపోతున్నారు అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ పరిణామాలను చాలా తీవ్రమైన విషయంగా అభివర్ణించారు. ఈ ఘటనలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) దర్యాప్తు ప్రారంభించింది. చైనాలో కూడా ఇటీవలి సంవత్సరాలలో ఇటువంటి కీలక రంగాలలో పనిచేస్తున్న కనీసం 9 మంది శాస్త్రవేత్తలు మరణించినట్లు దేశీయ, అంతర్జాతీయ మీడియా వార్తలు వెలువడ్డాయి. ఈ మరణాలకు ప్రమాదాలు లేదా ఆకస్మిక అనారోగ్యాలను కారణంగా చెప్పినప్పటికీ చాలావాటికి సరైన సమాధానం లభించడం లేదు. మరణించిన శాస్త్రవేత్తలు 26 నుంచి 68 ఏండ్లలోపు వారే.