న్యూఢిల్లీ : మయన్మార్, థాయ్‌లాండ్‌లలో శుక్రవారం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న 700 మంది ఈ విలయంలో సజీవ సమాధి అయ్యారు. 60 మసీదులు ధ్వంసమయ్యాయి. మయన్మార్ ముస్లిం నెట్వర్క్ స్టీరింగ్ కమిటీ సోమవారం ఈ హృదయ విదారకమైన వివరాలను వెల్లడించింది. ఈ దారుణ భూకంపాల్లో 2,028 మంది ప్రాణాలు కోల్పోయారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మండలేలో వీధులు శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి.
గంటల తరబడి శిథిలాలను తవ్వుతూ, రక్తమోడుతున్న చేతులతో ఉన్న ఓ వలంటీర్ మాట్లాడుతూ, శవాలు ఎక్కడబడితే అక్కడ ఉన్నాయన్నారు. శిథిలాల క్రింద నుంచి ఏడుపులు, మూలుగు వినిపిస్తున్నాయని, కానీ తాము వారిని సరైన సమయానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ యంత్రాలు తక్కువగా ఉన్నందువల్ల తాము చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నామన్నారు. కేథలిక్ రిలీఫ్ సర్వీసెస్ మయన్మా ర్ మేనేజర్ కారా బ్రాగ్ మాట్లాడుతూ.. దవాఖానాలు బాధితులతో నిండిపోయాయన్నారు. అవసరమైన మం దులు, రక్తం, తగిన పరిక రాలు లేవన్నారు. మయన్మార్ రాజధాని నేపిటాలో సామాన్యులను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భవనాలు, మిలిటరీ బ్యారక్స్‌లోనే సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రోడ్లు దెబ్బతినడం, విమానాశ్రయాలు పని చేయకపోవడం వల్ల, ప్రపంచ దేశాలు పంపిన సహాయం, మందులు, ఆహారం బాధితులకు చేర్చడం పెద్ద సవాల్‌గా మారిందని ఐరాస రిలీఫ్ కో ఆర్డినేటర్ అన్నారు.