ముంబై: వచ్చే నెలలో జరుగునున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. శుక్రవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కోణంలో కర్ణాటక ఎన్నికలను చూడకూడదని అన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వేరుగా ఉంటాయని, ఇది వేరే గేమ్ అని తెలిపారు. తన అంచనా ప్రకారం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. అయితే కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. లేనిపక్షంలో బీజేపీని ఓడించడం చాలా కష్టమని అన్నారు.
కాగా, శరద్ పవార్ ఈ ఇంటర్వూలో అదానీ గ్రూప్‌కు మద్దతుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికను అల్లిన కథనంగా పేర్కొన్నారు. ఒక వ్యాపార సంస్థ లక్ష్యంగా ఇది ఉందన్నారు. అలాగే ఈ నివేదికపై జాయింట్ పార్లమెంట్ కమిటీ కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను శరద్ పవార్ తోసిపుచ్చారు. దీని వల్ల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వృథా అయ్యాయని అన్నారు. దీంతో సామాన్య ప్రజల సమస్యలపై సభల్లో ఎలాంటి చర్చలు జరుగలేదన్నారు. అలాగే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీదే పైచేయిగా ఉంటుందని, అప్పుడు నిజం ఎలా బయటకు వస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. అప్పుడే నిజం ఏమిటన్నది తెలుస్తుందన్నారు.
మరోవైపు గతంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నాడు ప్రముఖంగా ఉన్న ‘టాటా-బిర్లా’ సంస్థలను ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయని శరద్ పవార్ తెలిపారు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ‘అదానీ-అంబానీ’ వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తాను అంగీకరించనని అన్నారు. దేశ అభివృద్ధిలో భాగమైన ప్రముఖ వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకోవడంలో ఎలాంటి అర్థం లేదన్నారు.
Also Read: