చెన్నై: మతోన్మాద ముప్పు నుంచి దేశాన్ని రక్షించడానికి కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా 37 మంది నేతలకు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అణగారిన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇటీవల ఆయన ప్రతిపాదించిన ‘ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్’లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. భారత జాతి ప్రస్తుతం మతోన్మాద ముప్పుతో తల్లడిల్లుతున్నదని, దేశంలో మతాధిపత్యం ఎక్కువయ్యిందని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి శక్తులను సమర్థంగా ఎదుర్కోవాలంటే రాజకీయాలను పక్కనబెట్టి భావసారూప్యత కలిగిన పార్టీలు ఒకేతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జాతి నిర్మాణంలో పాలు పంచుకొన్న అమరుల కలలు అప్పుడే సాకారమవుతాయన్నారు. సమాఖ్యవాదం, సామాజిక న్యాయం కోసమే తాను ఈ చొరవ తీసుకొన్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, వామపక్షాలు, జేడీఎస్, టీడీపీ, వైసీపీ, బీజేడీ, తృణమూల్, శివసేన, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, ఎంఐఎం, జనసేన తదితర పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ రాశారు.
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కోరారు. బుధవారం టీఎంసీ అధినేత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కోల్‌కతాలో ఆమె మాట్లాడారు. ‘పశ్చిమబెంగాల్లో సీపీఎంను ఓడించగలిగాం. బీజేపీని కూడా అలాగే ఓడించగలం’ అని వ్యాఖ్యానించారు. మేఘాలయ, చండీగఢ్‌లో బీజేపీ గెలిచేందుకు కాంగ్రెస్ సాయపడిందని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా ఒకేతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.