న్యూఢిల్లీ, ఆగస్టు 31: జిల్లా న్యాయవ్యవస్థ ఎప్పటికీ సబార్డినేట్ కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకు వెన్నెముక వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజలు న్యాయం కోసం మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థనే ఆశ్రయిస్తారని, అది చట్ట పాలనలో ఒక కీలకమైన భాగమని, అటువంటి దాన్ని సబార్డినేట్ అని పిలవడం ఆపాలని అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థను సబార్డినేట్‌గా పిలిచే బ్రిటీష్ కాలం నాటి సంప్రదాయాన్ని వదిలేయాలని సూచించారు.
సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం సుప్రీంకోర్ట్ ఆవరణలో ‘జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవాల స్టాంప్, నాణెన్ని మోదీ ఆవిష్కరించారు.
మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో తీర్పులు వేగంగా రావాలని ప్రధాని మోదీ అన్నారు. మహిళల భద్రతకు భరోసా కోసం ఇది అవసరమని చెప్పారు. మహిళలపై దురాగతాలు, బాలల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళనకరమైన అంశాలని తెలిపారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో ఓ వైద్యురాలిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేయడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సుప్రీంకోర్టు, దేశ న్యాయవ్యవస్థపై అపార నమ్మకం ఉందన్నారు.