Syed Adil Hussain | శ్రీనగర్, ఏప్రిల్ 23: ఉగ్రవాదుల దాడి నుంచి పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ఓ స్థానిక పోనీ (పొట్టి గుర్రం) రైడ్ ఆపరేటర్ తన ప్రాణాలనే అర్పించాడు. 28 ఏళ్ల సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అనే స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ సహోదరత్వానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిపోయాడు. పహల్గాం సమీపంలోని బైసరాన్ ప్రాంతంలో ముస్లిమేతర పర్యాటకులను ఉగ్ర దాడి నుంచి కాపాడేందుకు అడ్డు వెళ్లిన హుస్సేన్ తన ప్రాణాలనే బలిపెట్టాడు. ఓ కుటుంబాన్ని హుస్సేన్ బైసరాన్ తీసుకువెళ్లిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అయితే పారిపోవడానికి బదులు హుస్సేన్ ఉగ్రవాదుల వద్దకు పరుగున వెళ్లి ఓ ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు.
కొద్దిసేపు కాల్పులకు అంతరాయం ఏర్పడడంతో కొందరు పర్యాటకులు అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశం లభించింది. అయితే ఉగ్రవాదులు హుస్సేన్‌పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పర్యాటకులపై తుపాకీ గురిపెట్టడాన్ని చూసిన హుస్సేన్ ఒక్క క్షణం ఆలోచించలేదని, ఉగ్రవాదుల మీదకు ఉరికాడని అతని స్నేహితుడు, మరో పోనీ ఆపరేటర్ గులాం నబీ తెలిపాడు. పర్యాటకుల ప్రాణాలను కాపాడేందుకు హుస్సేన్ తన ప్రాణాలను అర్పించాడని నబీ చెప్పారు. తన కుటుంబానికి ఏకైక జీవనాధారం తన కుమారుడేనని హుస్సేన్ తల్లి రోదిస్తూ తెలిపారు. కుటుంబాన్ని పోషించడంతోపాటు అన్నీ తానై చూసుకునేవాడని, ఇప్పుడు తమకు దిక్కెవరని ఆమె వాపోయారు.