Mumbai | దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ (Swiss air tracking index IQAir – A real-time worldwide air quality monitor) తయారు చేసింది. ఈ జాబితాలో దేశరాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టి ముంబై రెండో స్థానంలో నిలిచింది.
భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరంగా ఇప్పటివరకూ చెప్పుకునే ఢిల్లీని కూడా ముంబై అధిగమించడం గమనార్హం. జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానానికి చేరుకుంది. తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది.
గతేడాది నవంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలే ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించి ఈ సర్వేను చెప్పట్టినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది.
మరోవైపు నగరంలో గాలి నాణ్యత పడిపోవడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చర్యలు చేపట్టింది. రాబోయే 10 రోజుల పాటు నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించింది. గత కొన్ని రోజులుగా నగరంలో గాలి నాణ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో దుమ్ము స్థాయిలను తగ్గించడానికి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
ముంబైలో గాలి నాణ్యత 225గా నమోదైంది. దీన్ని చాలా ‘పూర్’గా పరిగణిస్తారు. ముంబైతోపాటు మలాడ్(Malsd), మజగావ్ (Mazagaon), చెంబూర్ (Chembur), అంధేరీ (Andheri) వంటి ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 300 కంటే ఎక్కువగా నమోదైంది. కొలాబా (Colaba)లో 173, భాండూప్ (Bhandup)లో 125, బోరివ్లీ (Borivli)లో 111, వర్లీ (Worli)లో 101గా గాలి నాణ్యత నమోదైంది.