ముంబై, జూలై 6 : బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు నెలల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ. 6,695 కోట్ల ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే ఒక్క రుతుపవనాన్ని కూడా తట్టుకోలేకపోయింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మించిన మిస్సింగ్ లింక్‌ను ప్రారంభించిన 9 వారాలకే వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గం మూతపడింది. ఈ అంతరాయం మహారాష్ట్రకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకదాని నిర్మాణ సంసిద్ధతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
మిస్సింగ్ లింక్ టన్నెల్ సమీపంలో కొండచరియలు విరిగిపడడం, దీనికితోడుగా భారీ వర్షాలు కురువడంతో సోమవారం తెల్లవారుజామున ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణె హైవే రెండు వైపులా మూతపడింది. మే 1న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రారంభోత్సవం చేశారు. ఖాలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో శిథిలాల తొలగింపును చేపట్టి కొన్ని గంటల్లోనే పుణె వెళ్లే సొరంగం ద్వారా వాహనాలను మళ్లించినట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ(ఎంఎస్ఆర్డీసీ) తెలిపింది. ఇదే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన కొన్ని వారాలకే పతాక శీర్షికలకు ఎక్కింది. ఇదే నెల ప్రారంభంలో 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ సెక్షన్లో రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయవలసిందిగా ఎంఎస్‌ఆర్డీసీని ఆదేశించినట్లు ఫడ్నవీస్ తెలిపారు.
రోడ్డు ట్రాఫిక్‌తోపాటు రైలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్జత్-లోనావాలా సెక్షన్లో ఠాకూర్వాడీ, మంకీ హిల్ క్యాబినెట్ మధ్య పట్టాలపై కొండచరియలు విరిగిపడడంతో సెంట్రల్ రైల్వే సోమవారం డజనుకు పైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో డెక్కన్ క్వీన్, డెక్కన్ ఎక్స్‌ప్రెస్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, సిన్హగడ్ ఎక్స్‌ప్రెస్, ఇంద్రయాని ఎక్స్‌ప్రెస్ మొదలైనవి ఉన్నాయి. పలు దూర ప్రయాణ రైళ్లను దారిమళ్లించారు.