ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ముంబైలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ నాసిరకం పనుల బండారం దానిని ప్రారంభించిన నాలుగు రోజులకే బయటపడింది. శిల్పటా-కళ్యాణ్‌లను కలుపుతూ సుమారు 250 కోట్లతో 562 మీటర్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. పలావా ఫ్లైఓవర్‌గా పేరొందిన కటై-నిల్జే పై వంతెనను జూలై 4న శివసేన ఎంఎల్ఏ రాజేశ్ మోరే ప్రారంభించారు. అయితే అది ప్రారంభించిన నాలుగు రోజులకే దాని బండారం బయటపడింది.
వదులుగా ఉన్న కంకర, బురద నేల, సిమెంట్ పెచ్చులు తీయడం, అస్తవ్యస్తంగా, అసమానంగా వేసిన తారు భద్రతా ప్రమాణాలను అపహాస్యం చేస్తూ ప్రయాణికులకు సవాల్ విసురుతున్నాయి. ఈ వంతెనను ప్రారంభించిన రోజే ఇద్దరు బైకర్లు జారిపడి గాయపడ్డారు. కొందరైతే ఈ వంతెనను స్కిడ్డింగ్ జోన్‌గా విమర్శిస్తున్నారు.
ఇప్పటికే బ్రిడ్జిపై సుమారు 450 మీటర్ల ప్రాంతం కంకర తేలి నిర్మాణ నాణ్యతను తెలియజేస్తున్నది. గోతులతో నిండిన ఈ ఫ్లైఓవర్ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. కాగా, ఫ్లైఓవర్ పని నాణ్యతపై తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) హడావిడిగా కాంట్రాక్టర్లను రప్పించి రోజంతా ఆదరాబాదరాగా పైపై పూతలు పూసి గోతులు కన్పించకుండా మెరుగులు దిద్దింది.