Mumbai : ముంబైలో మొహర్రం సందర్భంగా భారీ కుట్ర బయటపడింది. పూనేకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు 14,900 ఎలుకల మందు గుళికల్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు పూర్తి విషపూరితమైనవి. శుక్రవారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై డీసీపీ జయంత్ మీనా శనివారం మీడియాకు వివరాల్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మొహర్రం రోజైన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి వాంతులు, కడుపునొప్పికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడి పేరు సల్మాన్ సయ్యెద్. మొహర్రం నిర్వహిస్తున్న సమయంలో అతడికి ఒక వ్యక్తి ఒక క్యాప్సూల్ ఇచ్చినట్లు చెప్పాడు.
దీంతో అతడికి ట్యాబ్లెట్ ఇచ్చిన ఫైయాజ్ ప్రేమ్‌జి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడి నుంచి ఎలుకల మందు (విషం) కలిపిన 14,900 క్యాప్సూళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైయాజ్ ఆ ట్యాబ్లెట్లను అక్కడ అందరికీ పంచేందుకు సిద్ధం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు ఫైయాజ్ పూనేకు చెందిన వాడు. అక్కడ ఒక పెయింటింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. 15 రోజుల క్రితం ముంబై వచ్చి ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. అలాగే, ఎలుకల మందుగా వాడే జింక్ ఫాస్ఫైడ్‌ను తెప్పించాడు. 50 కిలోల వరకు దీన్ని ఆర్డర్ చేశాడు. ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్కో క్యాప్సూల్‌లో ఒక గ్రామ్ నింపాలనుకున్నాడు. దీన్ని 30,000 క్యాప్సూల్స్‌లో నింపి మొహర్రం సందర్భంగా అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ, 14,900 ట్యాబ్లెట్లను మాత్రమే సిద్ధం చేయగలిగాడు. వాటిలో కొన్నింటిని మొహర్రం సందర్బంగా కొందరికి పంచేందుకు ప్రయత్నించాడు. చాలా తక్కువ మందికి మాత్రమే అతడు ఆ ట్యాబ్లెట్లు ఇవ్వగలిగాడు. ఆ లోపు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడు ఉండే గదికి వెళ్లి చూడగా, మిగిలిన ట్యాబ్లెట్లు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అతడి పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫైయాజ్ గత ఏడాది ఇరాన్, ఇరాక్ కూడా వెళ్లినట్లు తేలింది. మొహర్రం సందర్భంగా అల్లర్లు, అలజడి సృష్టించాలనేది అతడి లక్ష్యమని పోలీసులు తెలిపారు. దాదాపు 30,000 ట్యాబ్లెట్లు పంచి 30 వేల మందికి హాని తలపెట్టాలని ప్రయత్నించాడు. కానీ, పోలీసులు అరెస్టు చేయడంతో ప్రజలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, అతడు ఎందుకు ఇదంతా చేశాడు అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.