గాలె : శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు రాణించిన భారత బ్యాటర్లు రెండో రోజు తడబడ్డారు. దేవ్‌దత్ పడిక్కల్ (230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 167) జోరును కొనసాగించినా ధృవ్ జురెల్ (68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) మినహా మిగిలిన బ్యాటర్లు తేలిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 460/9తో నిలిచింది. వర్షం కారణంగా 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన మ్యాచ్‌లో భారత్.. 112 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు అంతగా ప్రభావం చూపని లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య (4/109), నువాంత కేశర (3/175) పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని చెలరేగి గిల్ సేనను కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యారు.
288/2తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన భారత్.. ఆరంభంలోనే రిషభ్ పంత్ (39) వికెట్ కోల్పోయింది. నువాంత బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన పంత్.. టైమింగ్ మిస్ అవడంతో మిడాఫ్ వద్ద దినుష అద్భుతమైన డైవ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. తొలి రోజు కండరాలు పట్టేడయంతో క్రీజు వదిలిన కేఎల్ రాహుల్ (82).. పంత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అతడు నాలుగు పరుగులు మాత్రమే జోడించి కేశర బౌలింగ్‌లో షార్ట్‌లెగ్ వద్ద నిషాన్ చేతికి చిక్కాడు. మరో ఎండ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ జోరును కొనసాగించిన పడిక్కల్.. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో బౌండరీతో 150 మార్కును చేరుకున్నాడు. కానీ కొద్దిసేపటికే జయసూర్య బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. సీనియర్ బ్యాటర్ రవీంద్ర జడేజా (13) ఆదుకుంటాడని భావించినా కేశర మరోసారి మాయ చేసి అతడికి చెక్ పెట్టాడు. టీ విరామం తరవాత అతడు.. జడ్డూను ఎల్బీగా వెనక్కి పంపడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.

లంక స్పిన్నర్లు విజృంభిస్తుండటంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్‌ను జురెల్, మానవ్ సుతార్ (24) ఆదుకున్నారు. నిలకడగా ఆడిన ఈ జోడీ.. లంక స్పిన్ ద్వయాన్ని నిలువరించి ఏడో వికెట్‌కు 66 బంతుల్లోనే 55 రన్స్ జోడించి భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపింది. లాహిరు ఓవర్లో జురెల్ రెండు బౌండరీలు బాదగా, మానవ్ ఓ ఫోర్ కొట్టడంతో భారత్ 400 రన్స్ మార్కును దాటింది. నువాంత ఓవర్లో డబుల్‌తో 66 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్న జురెల్.. జయసూర్య బౌలింగ్‌లో స్లిప్స్ వద్ద కెప్టెన్ ధనంజయ సూపర్ క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. జురెల్ నిష్క్రమణ అనంతరం సిరాజ్ (11), మానవ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ రెండో రోజే ఆలౌట్ అవుతుందా? అనిపించింది. కానీ కుల్దీప్ (12 బ్యాటింగ్), ప్రసిద్ధ్ (1 బ్యాటింగ్) లంకకు ఆ అవకాశాన్నివ్వలేదు.
రెండో రోజు వర్షం కారణంగా తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. గాలెలో ఆదివారం ఉదయం నుంచే మొదలైన వాన.. ఆగుతూ, కురుస్తూ ఆటకు తీవ్ర అంతరాయం కల్గించింది.

ఎట్టకేలకు మధ్యాహ్నానికి వరుణుడు శాంతించినా వెట్ ఔట్ఫీల్డ్తో పాటు వెలుతురు లేమి కారణంగా ఆట సాధ్యమవలేదు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది.
భారత్: తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లకు 460/9 (పడిక్కల్ 167, జురెల్ 51, ప్రభాత్ 4/109, నువాంత 3/175)