ముంబై, జూన్ 26: మహారాష్ట్రలో గోరక్షకులు ఘాతుకానికి పాల్పడ్డారు. గొడ్డు మాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ఒక యువకుడిని కొట్టి చంపారు. నాసిక్ జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 8న ఇలాగే ఓ యువకుడిని హత్య చేశారు. అన్సారీ (32), నాసిర్ ఖురేషి (24) శనివారం ఒక కారులో మాంసాన్ని ముంబైకి తీసుకువెళ్తుండగా 20 మంది మూక వీరిని అడ్డుకుంది. తాము గోరక్షకులమని పేర్కొంటూ గొడ్డు మాంసం ఎందుకు రవాణా చేస్తున్నారని దూషిస్తూ తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఖురేషి ఫిర్యాదు మేరకు 11 మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఘోటి పోలీసులు తెలిపారు.