Maharashtra | ముంబై, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సొంతూరు థానే ప్రభుత్వ దవాఖానలోనే మరణ మృదంగం మోగుతున్నది. చికిత్స కోసం దవాఖానకు వస్తే సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతున్నది. కేవలం ఐదు రోజుల్లోనే 29 మంది మరణించడం మహారాష్ట్రలో వైద్యరంగం దుస్థితిని వెల్లడిస్తున్నది. ఈ నెల 13న ఆదివారం 10 గంటల వ్యవధిలోనే 18 మంది మృతి చెందారు. అంటే సుమారు గంటకు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి షిండే సోమవారం థానే ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తక్షణం రూ.71 కోట్లు నిధులు కేటాయించారు. అయినా మరణాలు ఆగలేదు. సోమవారం నలుగురు, బుధవారం ఇద్దరు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. షిండే స్వయంగా రోగులను పరామర్శించి, వైద్యులతో సమీక్షించిన తెల్లారే మరో ఇద్దరు చిన్నారులు చనిపోవడం నిర్లక్ష్య వైద్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలో వైద్యరంగం దుస్థితికి ఈ పరిస్థితి అద్దం పడుతున్నది.సర్కారు తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ప్రాణాలను కాపాడటంలో ఏక్నాథ్ షిండే పూర్తిగా విఫలం అయ్యారని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. సొంత పట్టణంలోనే సరైన వైద్యం అందించలేని వ్యక్తి, రాష్ర్టాన్ని ఏం ఉద్దరిస్తారంటూ మండిపడుతున్నారు.
థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వ దవాఖాన సామర్థ్యం 500 పడకలు. దవాఖాన నిర్వహణపై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ దవాఖానలో వరుసగా మరణాలు నమోదవుతున్నాయి. దవాఖానకు థానే పట్టణంతోపాటు కళ్వా, ముంబ్రా, దివా, ఫాల్ఘర్ ఉల్హాస్ నగర్, కళ్యాణ్, డోంబివళీ, జవ్హార్, వాడా, మొఖాడా, షాపూర్, ముర్బాడ్, బీవండి తదితర పట్టణాల నుంచి వేల మంది పేదలు వైద్యం కోసం వస్తుంటారు. రోజూ సుమారు రెండు వేల ఓపీ నమోదవుతున్నది. ఏటా ఈ దవాఖాన నిర్వహణకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అయినా ఈ దవాఖానలో కనీస సదుపాయాలు లేవనే విమర్శలు వెల్లుతుతున్నాయి. కనీసం సరిపడా సిబ్బంది లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దవాఖానకు చాలా కాలంగా డీన్‌ను (సూపరింటెండెంట్) నియమించలేదు. తాతాలిక డీన్లు రోగులతో దురుసుగా ప్రవర్తించడం, కింది అధికారులపై ఒత్తిళ్లు, విచ్చలవిడి అవినీతి, తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొవిడ్ కాలంలో వెంటిలేటర్లు సరఫరా చేయడానికి ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి లంచం తీసుకుంటూ ఒక డీన్ ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇలాంటి అనేక కేసులు నమోదై ఉన్నాయి.
వరుస మరణాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దవాఖాన వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేశ్ గావ్డే తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నియమించిన కమిటీ.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని థానే మున్సిపల్ కమిషనర్ అభిజిత్ సింగర్ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా.. ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.