ముంబై: ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారి డిజిటల్ అరెస్టు(Digital Arrest)కు గురయ్యాడు. అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.58 కోట్లు కాజేశారు. ఈడీ, సీబీఐ అధికారులని చెప్పి మోసం చేశారు. ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు ఇంత భారీ మొత్తాన్ని వసూల్ చేసిన ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెప్పారు. ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ శాఖ దర్యాప్తు చేపడుతున్నది. కేసుతో లింకున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయని, ఆడియో-వీడియో కాల్స్‌తో జనాల్ని మోసం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. బాధితులను వత్తిడిలోకి నెట్టి వాళ్ల వద్ద నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారు.
ఆగస్టు 19వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీన మధ్య సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ అధికారులమని ఆ వ్యాపారిని బెదిరించారు. మనీ ల్యాండరింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. దీంతో భయపడ్డ ఆ వ్యాపారి, ఆయన భార్య ఆ తర్వాత డిజిటల్ అరెస్టుకు గురయ్యారు. వీడియో కాల్ ద్వారా ఆ ఇద్దర్నీ డిజిటల్ అరెస్టు చేశారు. తాము ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయాలని సైబర్ నేరగాళ్లు వత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
బాధిత వ్యాపారి ఆర్టీజీఎస్ ద్వారా కొన్ని బ్యాంక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేశాడు. రెండు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగినట్లు పోలీసు అధికారి చెప్పారు. చీటింగ్‌కు గురైనట్లు ఆలస్యంగా గుర్తించిన ఆ వ్యాపారి ఆ తర్వాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం క్రితం సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో ఆ డబ్బు సుమారు 18 అకౌంట్లకు బదిలీ అయినట్లు తేలింది. అయితే ఆ అకౌంట్లలో ఉన్న డబ్బును సీజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఈ కేసులో అబ్దుల్ ఖుల్లి, అర్జున్ కదవసర, జీతారాంలను పోలీసులు అరెస్టు చేశారు.