న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (Technical Issue) తలెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. జూలై 23న సాయంత్రం ఢిల్లీ (Delhi) నుంచి ముంబై (Mumbai) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 160 మంది ప్రయాణికులతో ముంబై వెళ్లేందుకు విమానం సిద్ధమైంది. అయితే చివరి క్షణంలో పైలట్లు సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. కాక్‌పిట్‌లో స్పీడ్ లిమిట్స్ చూపించే స్క్రీన్లలో లోపం ఉండటమే దీనికి కారణమని తెలుస్తున్నది.
కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారని చెప్పారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించామన్నారు.
ఇక బుధవారం ఉదయం కాలికట్ నుంచి దోహా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX375) సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో సిబ్బందితోపాటు మొత్తం188మంది ప్రయాణికులున్నారు. కాలికట్ నుంచి 9.15 గంటలకు బయల్దేరిన విమానం..11.12 గంటల ప్రాంతంలో తిరిగి కాలికట్ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయింది. క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో లోపం వల్ల భద్రతా చర్యగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.