ఢిల్లీ, మార్చి 17: ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్‌కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. సీఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలుస్తున్న దీని ద్వారా భారతీయులపై క్లినికల్ పరీక్షలు నిర్వహించగా.. 73 శాతం రోగుల్లో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. ఈ మేరకు లాన్సెట్ హెమటాలజీ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. సీఏఆర్ టీ- సెల్ థెరపీ అనేది టీ సెల్స్‌ను మోడిఫైడ్ చేయడం ద్వారా పని చేస్తుంది.
టీ సెల్స్ అనేవి ఒక రకమైన రోగనిరోధక కణాలు. ఇవి క్యాన్సర్‌పై పోరాడేందుకు సహకరిస్తాయి. ముంబైకి చెందిన టాటా మెమోరియల్ హాస్పిటల్, ఐఐటీ-బాంబే సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం ముఖ్యంగా లుకేమియా, లింపోమా క్యాన్సర్లపై దృష్టి పెడుతుంది. రిలాప్స్ (ఒకానొక దశలో వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ బీ-సెల్స్‌పై కణతులు పెరగడం), రెఫ్రెక్టరీ (ఔషధాలకు స్పందించని స్థితి) కారణంగా తక్కువ ఆదాయ దేశాల్లో చాలామంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు వీటిపై దృష్టిసారించారు.
11 ఏండ్ల పాటు జరిగిన అధ్యయనంలో భాగంగా పరిశోధకులు టాలికాబ్టజీన్ ఆటోల్యూసెల్ ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. ల్యాబ్ పరీక్షలు, జంతువులపై టెస్టులు విజయవంతమయ్యాక, ఇప్పుడు తాజాగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. ట్రయల్స్‌లో భాగంగా మొదటి దశలో బీ-సెల్ లింపోమాతో బాధపడుతున్న 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 14 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చి పరీక్షించారు. రెండో దశలో భాగంగా బీ-సెల్ లుకేమియాతో బాధపడుతున్న 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 50 మందిపై పరీక్షించారు. వీరి సగటు వయసు 44. వీరిలో 49 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు. వారిపై ఔషధ పనితీరును విశ్లేషించగా.. 73 శాతం ప్రతిస్పందన రేటు కనిపించింది. ఈ చికిత్స క్యాన్సర్ రోగులకు పునర్జన్మ లాంటిదని, ఇతర దేశాల్లో ఉన్న చికిత్సలతో పోలిస్తే దీని వ్యయం చాలా తక్కువని పరిశోధకులు తెలిపారు.