నదియా అత్యాచారంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేశాయి. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌగతారాయ్ చేసిన వ్యాఖ్యలు తప్పని పార్టీ ఎంపీ శతాబ్ది రాయ్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలు జరుగుతుండగా ఏ సీఎం అయినా చూస్తూ ఊరుకుంటారా? అంటూ నిలదీశారు. అయితే అలాంటి ఘటనలు జరగడం మాత్రం సిగ్గుచేటని తామందరమూ భావిస్తున్నామని శతాబ్దిరాయ్ అన్నారు. మహిళా ముఖ్యమంత్రి ఉండగా అనడంలో అర్థమేమి? పురుష సీఎం ఉంటే.. జరిగేవి కావా? అంటూ శతాబ్ది ఫైర్ అయ్యారు.
ఇక…తృణమూల్ ఉపాధ్యక్షుడు జయ ప్రకాశ్ మజుందార్ కూడా సౌగతా రాయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్నా, పురుష ముఖ్యమంత్రి ఉన్నా… మహిళలకు సెక్యూరిటీ ఉండాలని, సీఎం స్థానంలో ఎవరున్నా.. ఇలాంటి ఘటనలను ఖండించాల్సిందేనన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. సీఎం మమత నేతృత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని ప్రకటించారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవే అని మద్దతిస్తున్నారు.