Watermelon | మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలో బిర్యానీ తిన్న తర్వాత కాసేపటికే పుచ్చకాయ తిని ఓ ఫ్యామిలీ చనిపోయిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ల మరణానికి పుచ్చకాయ కారణం కాదని తెలిసినప్పటికీ ఇంకా భయం పోలేదు. ఇలాంటి తరుణంలో మరో వ్యక్తి పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై మరణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని షాజీపూర్కు చెందిన ఇంద్రకుమార్ (43) అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సంగీత, ముగ్గురు కుమారులు వినోద్ (21), రాజా, దేవాతో కలిసి షియోపూర్‌లో ఉంటున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ఇంద్ర, వినోద్ ఇద్దరూ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కోటా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ఇంద్ర మరణించాడు. వినోద్‌ను కోటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై షియోపూర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆర్బీ గోయల్ స్పందించారు. పుచ్చకాయ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని తెలిపారు. కడుపులో ఇన్ఫెక్షన్ లేదా ఇతరత్రా కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. కాగా, గురువారం రాత్రి నుంచే ఇంద్ర, వినోద్ అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పడం గమనార్హం.