భోపాల్, అక్టోబర్ 23: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తాజాగా ఓ లైంగిక దాడి కేసులో దోషి శిక్షను జీవిత ఖైదు నుంచి 20 ఏండ్లకు తగ్గించింది. రేప్ క్రూరమైనదైనా, లైంగిక దాడి తర్వాత దోషి ఆ 4 ఏండ్ల బాధితురాలిని ప్రాణాలతో వదిలివేశాడని, సజీవంగా వదిలిపెట్టేంత దయ చూపాడని కోర్టు పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ సుబోధ్ అభయాంకర్, జస్టిస్ ఎస్కే సింగ్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
అప్పీలుదారుడిని ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించడంలో తప్పు లేదని, అయితే అతనికి ఉపశమన ప్రయోజనం కల్పిచడం సరైనదని భావిస్తున్నట్టు తెలిపింది. ‘మహిళల పట్ల గౌరవం లేని, 4 సంవత్సరాల పాపపై లైంగిక నేరానికి పాల్పడే ప్రవృత్తి కలిగిన అప్పీలుదారుడి రాక్షస చర్యను పరిగణనలోకి తీసుకోవడంలో కోర్టు ఎటువంటి తప్పును కనుగొనలేదు. ఇప్పటికే అనుభవిస్తున్న శిక్షను తగ్గించదగిన కేసుగా కూడా దీన్ని భావించడం లేదు. అయినప్పటికీ, బాధితురాలిని సజీవంగా వదిలిపెట్టేంత దయతో ఉన్నాడన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటే, అతని జీవిత ఖైదును 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షకు తగ్గించవచ్చు’నని కోర్టు అభిప్రాయపడుతున్నదని బెంచ్ పేర్కొన్నది.