Operation Sindoor | భోపాల్, లక్నో, మే 16 : సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్ గురించి మీడియాకు వెల్లడించిన అధికారిణుల పైనా కమలం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితంగా ఉంటున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ నాయకుల తీరు మారడం లేదు! ఇటీవల మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా భారత సైన్యాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జగదీశ్ దేవ్డా ఆపరేషన్ సిందూర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
శుక్రవారం జబల్పూర్లో సివిల్ డిఫెన్స్ వ లంటీర్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దేవ్డా మాట్లాడుతూ… యావద్దేశం, మన సైనికులు ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు మొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో దేశం ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో మన సైన్యం, మన భద్రతా దళాలు సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మన సాయుధ దళాల పరాక్రమాన్ని చిన్నచూపు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రధానికే మొత్తం ఘనతను ఆపాదిస్తున్నారని ప్రతిపక్షంతోపాటు పలువురు రక్షణ రంగ నిపుణులు విమర్శించారు. దేవ్డా వ్యాఖ్యలు చవకబారుగా, సిగ్గుచేటుగా ఉన్నాయని కాంగ్రెస్ అభివర్ణించింది. ఇది మన సైన్యం శౌర్య పరాక్రమాలను అవమానించడమేనని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ విమర్శించింది.
సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ కోసం వచ్చిన వలంటీర్లను ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందని ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కింద భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాయని చెప్తూ సాయుధ దళాల పాదాలకు అత్యంత గౌరవభావంతో యావద్దేశ ప్రజలు మొక్కుతున్నారని తాను అన్నానని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌కు గట్టిగా జవాబిచ్చినందుకు ప్రధాని మోదీని ప్రశంసించినట్లు దేవ్డా తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ దళాల తరఫున మీడియా సమావేశాలు నిర్వహించిన భారత సైనిక అధికారిణులు వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి కులాలను ప్రస్తావించి సమాజ్‌వాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ మరో వివాదాన్ని రాజేశారు. గురువారం మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యాదవ్ మాట్లాడుతూ తిరంగా యాత్రల ద్వారా రాజకీయ లబ్ధి కోసం సైనిక ఆపరేషన్‌ను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరో, ఆమె కులం ఏమిటో బీజేపీ నాయకులకు తెలియదు. అలాగే ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఎవరో కూడా వారికి తెలియదు. తెలిసి ఉంటే వారిని కూడా దూషించి ఉండేవారు.
వ్యోమికా సింగ్ హర్యానాకు చెందిన జాట్ కాగా ఏకే భారతి బీహార్‌లోని పూర్నియాకు చెందిన యాదవ్. వీరితోపాటు ఉన్నందుకే ముస్లిం మతానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు’ అంటూ రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. కులాలు, మతాల గురించి తెలిసిన తర్వాత బీజేపీ నాయకులు ఊరుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం అయినందున ఓ మహిళా అధికారిని(సోఫియా ఖురేషీ) విమర్శించారు. మరో వ్యక్తిని(వ్యోమికా సింగ్) రాజ్‌పుత్‌గా భావించి ఆమెనేమీ అనకుండా వదిలివేశారని ఆయన చెప్పారు. ఆ ముగ్గురు మహిళా అధికారులను వెనుకబడిన-దళిత-మైనారిటీ గ్రూపుగా వారి కులాలను ఆధారం చేసుకుని యాదవ్ అభివర్ణించారు. కాగా యాదవ్ వ్యాఖ్యలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు.