భోపాల్, జూలై 8: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత రామ్నివాస్ రావత్ ఒకే రోజు కేవలం 15 నిముషాల వ్యవధిలో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రావత్‌ను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీనితో ఆయన సోమవారం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన తన ప్రమాణంలో రాజ్య కే మంత్రి (రాష్ట్ర మంత్రి)కి బదులుగా రాజ్య మంత్రి (సహాయ మంత్రి) అని ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నేతలు, మీడియాలో గందరగోళం ఏర్పడటంతో జరిగిన పొరపాటును గ్రహించారు. దీంతో కొద్ది నిముషాల అనంతరం గవర్నర్ రెండోసారి ఆయనతో రాజ్య కే మంత్రి అంటూ ప్రమాణం చేయించారు.
తాను మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసినట్టు రావత్ మీడియాతో సరదాగా వ్యాఖ్యానించారు. విజయ్పూరి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన రావత్ లోక్‌సభ ఎన్నికల సందర్బంగా ఏప్రిల్ 30న బీజేపీలో చేరి ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడం పట్ల ఆ పార్టీ మండిపడింది.