TMC | కోల్‌కతా, ఆగస్టు 12: ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు. మంగళవారం కోల్‌కతా విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ప్రక్రియ నిజాయితీ, సమగ్రతను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అవకతవకలతో కూడిన ఓటరు జాబితాను వాడుకుంటోందని బెనర్జీ ఆరోపించారు. ఒక ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబర్‌తో అనేక ఓటర్లు ఉన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీ అందచేస్తున్న వివరాలు కావు. ఇది ఈసీఐకి చెందిన వివరాలే.
ఈసీఐని బీజేపీ ఎందుకు వెనకేసుకువస్తోంది అని ఆయన నిలదీశారు. దీనికి బీజేపీ జవాబివ్వాలని ఆయన డిమాండు చేశారు. ఓటరు జాబితాలో అక్రమాలపై బీజేపీ మౌనంగా ఉండడం, ఢిల్లీలో నిరసన తెలియచేస్తున్న ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడం వంటివి తప్పును కప్పిపుచ్చుకునే చర్యలేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ వద్ద నిజాయితీతో కూడిన సమాధానాలు ఉంటే సోమవారమే పార్లమెంట్లో చర్చకు ముందుకు వచ్చేదని, అందుకు బదులుగా నిరసన తెలిపిన విపక్ష మహిళా ఎంపీలను వేధించి పోలీసు స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారని ఆయన ఆరోపించారు.
ఓటరు జాబితాను తారుమారు చేసిన మాజీ సీఈసీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. దీంట్లో భాగస్వామ్యం ఉన్నట్లు తేలితే ప్రధాని, హోం మంత్రితోసహా ఎంతటివారినైనా విడిచిపెట్టకూడదు. ఇదే ఓటరు జాబితాను వాడుకుని బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు రుజువైతే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధం. మళ్లీ తాజాగా ఎన్నికలు జరపించాలి అని టీఎంసీ లోక్‌సభ సభ్యుడైన అభిషేక్ బెనర్జీ డిమాండు చేశారు. మీ ఓటరు జాబితా స్వచ్ఛంగా ఉంది.. బెంగాల్లో తప్పుల తడకగా ఉందని ఎవరూ చెప్పలేరని ఆయన స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో మోసాన్ని జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు. అయితే బీజేపీ మాత్రం ప్రతిపక్షపాలిత రాష్ర్టాలదే తప్పంటూ నిందను ఇతరులపైకి తోసేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.