Alzheimers | ఢిల్లీ, జనవరి 26: మెదడు వయసు పెరగడం, వృద్ధాప్యానికి గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. తల్లి నుంచి బిడ్డలకు సంక్రమించే ‘ఎక్స్’ క్రోమోజోముల (ఒక కణం నుంచి మరో కణానికి జన్యు సమాచారాన్ని తీసుకెళ్లే దారం లాంటి సూక్ష్మ నిర్మాణాలు) కారణంగానే మెదడు వృద్ధాప్యం చెందుతుందని, దీని ప్రభావం మూలంగానే అల్జీమర్స్(మతిమరుపు) కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా మహిళల్లో రెండు ‘ఎక్స్’ క్రోమోజోములు ఉంటాయి.
పురుషుల్లో మాత్రం ‘ఎక్స్’, ‘వై’ అనే రెండు వేర్వేరు క్రోమోజోములు ఉంటాయి. సహజంగా ఎక్స్ క్రోమోజోముల్లో జన్యు పదార్థాలు ఉంటాయి. ఇందులో జరిగే మ్యుటేషన్లు తీవ్ర ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రతి కణంలోనూ రెండు క్రోమోజోముల్లో ఏదో ఒకటి డియాక్టివెటేడ్ స్థితిలో ఉంటుంది. ఇదే అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అయితే అల్జీమర్స్ మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అయితే ఈ వ్యాధి సంక్రమించినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
అధ్యయనంలో భాగంగా వివిధ వయస్సులు గల ఎలుకలపై పరిశోధకులు ప్రయోగం చేశారు. మెదడులోని హిప్పోక్యాంపస్ (నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి) అనే ప్రాంతంలో తల్లి ఎక్స్ క్రోమోజోములు చూపిన ప్రభావం కారణంగా మెదడు వృద్ధాప్యానికి దారితీసే జీవసంబంధమైన మార్పులు జరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. కాలక్రమంలో ఇదే అల్జీమర్స్‌కు దారితీస్తుందని పరిశోధకులు తేల్చారు. తల్లి నుంచి ఎక్కువగా ఎక్స్ క్రోమోజోములు సంక్రమించే మహిళల్లో అల్జీమర్స్ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన సేన డుబల్ తెలిపారు. ఈ అధ్యయనం ఎలుకలపై జరిగినప్పటికీ, మానవులకు అన్వయించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.