Suicide : తల్లి ఫోన్ మాట్లాడుతలేదనే వేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుముడివాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24) కు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దాంతో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది.
అబిషా వర్మ తనకు 22 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది. ఆ తర్వాత ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్టుమెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటోంది. రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లి వచ్చేది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడటం లేదు. శనివారం కూడా తన తల్లికి పలుమార్లు ఫోన్ చేసింది. కానీ తల్లి ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. దాంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.