Sabarimala | శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) భక్తులతో (pilgrims) కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములతోపాటు వేలాదిగా భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మండల – మకరవిళక్కు సీజన్లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్థానం బోర్డు ట్రావెన్కోర్ దేవస్వాం (Travancore Devaswom Board) తెలిపింది. నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో కేవలం 3,03,501 మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపింది. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని పేర్కొంది.
మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతోపాటు ఆదాయం కూడా భారీగా సమకూరినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.13.33 కోట్ల ఎక్కువ అని వెల్లడించింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు.
Also Read..
Air Pollution | ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హైదరాబాద్లో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
Sambhal | మసీదు సర్వే.. సంభల్లో ఇంటర్నెట్, స్కూల్స్ బంద్