Air Pollution | సిటీబ్యూరో, నవంబర్ 24(నమస్తే తెలంగాణ: నగరంలో వాతావరణం ప్రమాదకరంగా మారుతున్నది. నిత్యం పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిమాణాన్ని దాటిపోతున్నది. దీంతో కొన్ని ప్రాంతాల్లో పీల్చే గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లుగా తేలింది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం పరిశ్రమలు విస్తరించిన కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్‌తోపాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్య కారకాలు ప్రమాదకరంగా మారినట్లుగా తేలింది.
ఆదివారం పలు ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 దాటింది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యంలో హైదరాబాద్ దూసుకుపోతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నగరంలో పరిస్థితి చేజారక ముందే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని, కాలుష్య కారకాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా నగరంలో వాతావరణంలో పెరుగుతున్న దుమ్ము, ధూళి కణాల తీవ్రతను అధిగమించేలా పీసీబీ, బల్దియా చర్యలు తీసుకోవాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, శాఖల వైఫల్యం నగరవాసుల పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలో చిన్నారులు, వయోవృద్ధులు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడేవారికి హైదరాబాద్ వాతావరణం ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేదు. ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో నిలిచింది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఏడో స్థానంలో ఉందని వెల్లడైంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి. దీంతో గాలిలో దుమ్ము, ధూళి కణాల ప్రభావం భారీగా ఉన్నది. దీంతో ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ సూచిక దారుణంగా పడిపోతుంది.
గ్రేటర్ పరిధిలో కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్య కారకాల పరిమాణం ఒక్క ఏడాదిలో భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300పైనే ఉండగా, గతంలో సాధారణ రోజుల్లో 150 మేర ఉండేది. కానీ ప్రభుత్వం నగరంలో కాలుష్య నియంత్రణ మార్పులపై దృష్టి పెట్టకపోవడంతోనే.. పరిస్థితి దారుణంగా మారిందని పర్యావరణ సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతేడాదిలో గాలిలో పీఎం2.5 స్థాయి తో పోల్చితే ఈసారి నగరంలోని పలు ప్రాంతాల్లో మూడింతలు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగరంలో కాలుష్య నియంత్రణకు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. లేదంటే ఢిల్లీ లాంటి పరిస్థితులు నగరంలోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.