Jupally Krishna Rao | మైలార్‌దేవ్‌పల్లి, నవంబర్ 24: తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే.. ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని అత్తాపూర్‌కు చెందిన బాధిత యజమానులు ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి జూపల్లి, ఆయన కుమారుడు వరుణ్ అధికార బలాన్ని ఉపయోగించుకొని తమ భూముల్లోంచి అక్రమంగా వారి భూమి వద్దకు రోడ్డు వేయించుకుంటున్నారని ఆరోపించారు. కొనసాగుతున్న రోడ్డు పనులను ఆదివారం అడ్డుకొని ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా బాధితులు, పట్టా భూముల యజమానులు కొండకళ్ల శ్రీకాంత్, కొండకళ్ల మణికాంత్ మాట్లాడుతున్న తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అత్తాపూర్ సర్వే నంబర్ 94లో తమకు 2490.18 గజాల స్థలం ఉన్నదని, సర్వే నంబర్ 95లో హైదర్‌గూడకు చెందిన బండారు నారాయణకు సంబంధించిన స్థలం ఉన్నదని చెప్పారు. వీరి స్థలాలను దాటి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్వే నంబర్ 55లో నాలుగెకరాల స్థలం ఉన్నదని వివరించారు. నారాయణ, మంత్రి కుమ్మక్కై తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్రపన్నారని, తమను వేధింపులకు గురిచేయడమే కాకుండా 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేలా తమపై ఒత్తిడి చేశారని తెలిపారు.
2022లో తాము 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చామని చెప్పారు. తర్వాత తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని వాపోయారు. దస్తావేజులు సేకరించి అందులో తమకు జరిగిన మోసాన్ని గుర్తించామని చెప్పారు. సర్వే నంబర్ 95లోని నిర్మాణానికి 40 ఫీట్లు వదలాల్సి ఉన్నదని, వారు రోడ్డుకు స్థలం వదలకుండా తమ స్థలంలోని 20 ఫీట్లు వదులుతున్నట్టు2017లో తమకు తెలియకుండా తామే రోడ్డుకు ఇస్తున్నట్టు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకున్నారని వివరించారు. ఎలాంటి సమాచారం లేకుండా తమ స్థలాన్ని ఎలా చూపిస్తారని బాధితులు ప్రశ్నించారు.
మోసపోయామని గుర్తించి 2024 అక్టోబర్ 4న కోర్టులో కేసు వేశామని, డిసెంబర్ 9న కేసు హియరింగ్ ఉన్నదని చెప్పారు. దీంతో మంత్రి జూపల్లి తన పలుకుబడిని ఉపయోగించి ఫేక్ ఆర్డర్ తెచ్చి రోడ్డు పనులను ప్రారంభించారని, పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు దగ్గరుండి రోడ్డు పనులు చేయించడం విడ్డూరంగా ఉన్నదని వాపోయారు. స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా తమకు పోలీసులు, అధికారులు అనుమతివ్వడం లేదని చెప్పారు. పేదల బస్తీల్లో రోడ్లు లేకున్నా ఏ ఒక్క అధికారీ స్పందించడు కానీ మంత్రి కృష్ణారావు స్థలానికి రోడ్డు వేసేందుకు మాత్రం అధికారుల యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నదని మండిపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగే దాకా ఆందోళన చేస్తామని తెలిపారు.