ముంబై / ఢిల్లీ : కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2,510 మంది కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా 251 మంది కోలుకున్నారు. అంతకుముందు మంగళవారం ముంబైలో 1చ331 మందికి కరోనా సోకింది. రెండు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ముంబైలో 7.75లక్షల కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం 6080 యాక్టివ్ కేసులుండగా.. మహమ్మారి కారణంగా మొత్తం 16,375 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం నగరంలో రికవరీ రేటు 97 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా కేసుల పెరుగుదలపై మంత్రి ఆదిత్య ఠాకే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలిస్తే ఇవాళ్టి నుంచి కేసుల సంఖ్య 2వేల మార్క్ దాటుతుందని బుధవారం అన్నారు. సోమవారం ముంబైలో 809 కరోనా కేసులు రికార్డవగా.. మంగళవారం నాటికి ఈ సంఖ్య 1377కి పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం 923 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు మంగళవారం 496 కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలితే 86శాతం కేసుల పెరుగుదల నమోదైంది. బుధవారం ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. తాజాగా 344 మంది బాధితులు కోలుకోగా మరణాలు నమోదు కాలేదు. ఢిల్లీలో ప్రస్తుతం 2,191 యాక్టివ్ కేసులున్నాయి.
మరో వైపు కరోనా కొత్త వేరియంట్ కేసులు సైతం ఢిల్లీలో భారీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు 238 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఓ వైపు ఒమిక్రాన్, మరో వైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన ఆరు రోజుల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధానిలో యాక్టివ్ కేసులు 1,612 ఉన్నాయి.