న్యూఢిల్లీ: దేశంలో 2025-26 విద్యా సంవత్సరంలో 55కు పైగా ఇంజినీరింగ్ కళాశాలలను వివిధ కారణాలతో మూసివేసినట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) వెల్లడించింది. ఇందులో మూడు ప్రభుత్వ ఎయిడెడ్వి కాగా, మిగతావి ప్రైవేట్ కాలేజీలు. అయితే ఈ కాలేజీల్లో ప్రవేశానికి అప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీని పూర్తి చేయడానికి అనుమతించినట్టు తెలిపింది. మొత్తం 58 ఇంజినీరింగ్, సాంకేతిక కళాశాలలు క్రమంగా మూతపడ్డాయని వివరించింది. వీటిలో యూపీ, మహారాష్ట్రల్లో అత్యధికంగా 12 కాలేజీలు చొప్పున ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 8, తెలంగాణ, పంజాబ్ రాష్ర్టాల్లో నాలుగు చొప్పున, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో మూడు చొప్పున, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ల్లో రెండేసి మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక, ఇంజినీరింగ్ కాలేజీల్లో అందిస్తున్న 950కు పైగా కోర్సులను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. కళాశాలల మూసివేతకు పలు కారణాలు ఉన్నట్టు ఏఐసీటీఈ తెలిపింది. తక్కువగా విద్యార్థుల నమోదు, అవసరమైన ఫ్యాకల్టీల నియామకంలో వైఫల్యం, సంస్థ నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాల లేమి, నిబంధనలు పాటించడంలో విఫలం వంటి కారణాలు ఉన్నట్టు పేర్కొంది.