Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్‌కు యోగి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు ఆ తర్వాత నుంచి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య ధామ్‌లో పార్కింగ్ కోసం 51 స్థలాలను గుర్తించింది. ఆయా పార్కింగ్ స్థలాల్లో 22,825 వాహనాలను పార్క్ చేసే వీలుంటుంది. అంతే కాకుండా పార్కింగ్ కోసం ఎటూ తిరుగాల్సిన అవసరం లేకుండా గూగుల్ మ్యాప్‌లో పార్కింగ్ స్పాట్లను అప్లోడ్ చేశారు.
వీవీఐపీలు, వీఐపీలు, ఇతర అతిథుల కోసం పార్కింగ్ స్థలాలు సైతం సర్కారు రిజర్వ్ చేసింది. ఈ పార్కింగ్ స్థలాలు వైర్లెస్, పీఏ వ్యవస్థలతో అనుసంధానించింది. అయోధ్య ధామ్‌లో రామ్లాల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేయడానికి 51 స్థలాలను గుర్తించినట్లు ట్రాఫిక్ ఏడీజీ బీడీ పాల్సన్ తెలిపారు. ఇందులో దాదాపు 22,825 వాహనాలు పార్కింగ్ చేయవచ్చన్నారు. రాంపత్లో 5 స్థలాలు, భక్తి మార్గ్‌లో ఒకటి, ధర్మ మార్గ్‌లో నాలుగు చోట్ల, పరిక్రమ మార్గ్‌లో ఐదు చోట్ల, బంధా మార్గ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ, నాజుల్, ప్రైవేట్, టూరిజం శాఖ భూముల్లో ఈ పార్కింగ్ స్థలాలు నిర్మించారు.
దీంతో పాటు అయోధ్య ధామ్‌లో నిర్మించిన మల్టీలెవల్ పార్కింగ్‌లో కూడా వాహనాలను పార్కింగ్ చేస్తారు. అయోధ్య ట్రాఫిక్ సీఓ రాజేష్ తివారీ మాట్లాడుతూ రాంపథ్, భక్తి పథ్‌లో ఉన్న ఆరు పార్కింగ్ స్థలాలను వీవీఐపీ అతిథుల వాహనాల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపారు. 1,225 వీవీఐపీ వాహనాలు ఇక్కడ పార్క్ చేయవచ్చన్నారు. ధర్మపథ్ మార్గ్, పరిక్రమ మార్గ్‌లోని తొమ్మిది పార్కింగ్ స్థలాలను వీఐపీల కోసం రిజర్వ్ చేశామన్నారు. హెచ్-27లో పోలీస్ ఫోర్స్ కోసం ఎనిమిది పార్కింగ్ స్థలాలు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా పార్కింగ్ స్థలాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.