Vande Bharat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గత లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ పేరిట బీజేపీ సర్కారు సెమీ-హైస్పీడ్ తొలి సర్వీసును ప్రారంభించింది. నాలుగేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి తొలి రైలును ప్రారంభించారు. ఇప్పటివరకూ 14 వరకు రైళ్లు ప్రారంభమయ్యాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఈ రైళ్లను తీసుకొచ్చినట్టు మోదీ ఆర్భాటంగా చెప్పుకొన్నారు. అయితే, తాము ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ పథకానికి బీజేపీ సర్కారే ఇప్పుడు తూట్లు పొడుస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 120 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్‌ను దేశంలోని దిగ్గజ నవరత్న కంపెనీలను కాదని.. రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ (టీఎంహెచ్) అనే కంపెనీకి కట్టబెట్టింది. రైళ్ల తయారీ, సరఫరా, నిర్వహణ తదితరాల కోసం టీఎంహెచ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 53 వేల కోట్లను చెల్లించనున్నది. ఈ మేరకు రష్యా న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ పేర్కొన్నట్టు ‘ది వైర్’ వెల్లడించింది.
2019లో ప్రారంభమైన తొలి వందే భారత్ రైలును చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారీ చేసింది. అయితే ఆ కంపెనీని కాదని రష్యా సంస్థకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందేభారత్ రైళ్ల తయారీ నిధులను ‘మేకిన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకూ విడుదల చేశారు. రష్యా కంపెనీ తయారుచేసిన వందేభారత్ రైళ్ల కోసం కూడా ఇదే స్కీమ్ నుంచి ఫండ్‌ను వినియోగించనున్నట్టు తెలుస్తున్నది. అంటే, విదేశీ కంపెనీ తయారు చేసే రైళ్ల ప్రాజెక్టు కోసం ‘మేకిన్ ఇండియా’ పేరిట నిధులను విడుదల చేయనున్నారు. 120 వందే భారత్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్‌ను టీఎంహెచ్‌కు ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించగా.. వచ్చే జూన్ ఒకటిన అధికారికంగా ఒప్పందంపై సంతకాలు జరుగనున్నట్టు టాస్ పేర్కొంది. 35 ఏండ్ల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం కోసం రైళ్ల తయారీ, సరఫరా, నిర్వహణ నిమిత్తం.. రూ. 53 వేల కోట్లను చెల్లించనున్నారు. కాగా 200 వందేభారత్ రైళ్ల తయారీ కోసం టెండర్లను పిలువగా.. రష్యాకు చెందిన టీఎంహెచ్, ఆర్వీఎన్ఎల్ కన్సార్టియం తక్కువ మొత్తానికి బిడ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 120 రైళ్ల కాంట్రాక్ట్‌ను టీఎంహెచ్‌కు, మిగిలిన 80 వందేభారత్ రైళ్ల కాంట్రాక్ట్‌ను బీహెచ్ఈఎల్, టీటాగఢ్ వ్యాగన్స్ లిమిటెడ్ కన్సార్టియంకు ఇచ్చినట్టు వివరించాయి.
‘మేకిన్ ఇండియా’ పేరు చెప్పి దేశీయ కంపెనీలను కాదని వందే భారత్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్‌ను రష్యా కంపెనీకి కేంద్రప్రభుత్వం కట్టబెట్టడంపై సోషల్‌మీడియాలో పెద్దయెత్తున దుమారం రేగుతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసిన కేంద్రం.. ఆ ప్రయోజనాలను సామాన్యులకు దక్కనీయకుండా.. పెద్దయెత్తున చమురును దొడ్డిదారిన పశ్చిమ దేశాలకు సరఫరా చేసిందని పలువురు ఆరోపించారు. ఇప్పుడు, దేశీయ కంపెనీల ప్రయోజనాలను పక్కనబెట్టి రష్యా కంపెనీలకు వేల కోట్ల కాంట్రాక్ట్‌లను అప్పగించడంలో దాగున్న మర్మమేమిటని కేంద్రాన్ని నిలదీస్తున్నారు.