ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్(Sajeeb Wazed) మీడియాతో మాట్లాడారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను అప్పగించాలని ఇటీవల బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో హసీనా కుమారుడు సాజీబ్ మాట్లాడుతూ బంగ్లా న్యాయ ప్రక్రియను ఆయన వ్యతిరేకించారు. తన తల్లి పట్ల బంగ్లా సర్కారు సరైన రీతిలో ప్రవర్తించడం లేదన్నారు. సరిహద్దు వెంట ఉగ్రవాదం పెరుగుతున్నట్లు కూడా సాజీద్ భారత్‌ను హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ తన తల్లికి ఆశ్రయం కల్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన మాతృమూర్తిని చంపేందుకు మిలిటెంట్లు ప్లాన్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
షేక్ హసీనా అప్పగింతపై వచ్చిన అభ్యర్థనను వాజిద్ తిరస్కరించారు. తప్పుడు రీతిలో తన తల్లిపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. సుమారు 17 మంది జడ్జీలను తొలగించి విచారణ కొనసాగించారని, పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించారని, డిఫెన్స్ అటార్నీలను కోర్టుకు రానివ్వలేదని అన్నారు. అప్పగింత కోసం బంగ్లాదేశ్ చేసిన రిక్వెస్ట్‌ను భారతీయ అధికారులు తిరస్కరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. మా అమ్మ ప్రాణాలను భారత్ రక్షించిందని, ఒకవేళ ఆమె బంగ్లాదేశ్‌ను వీడిచిపెట్టకుంటే, మిలిటెంట్లు ఆమెను చంపేవాళ్లు అని అన్నారు. హసీనా ప్రభుత్వం సమయంలో అరెస్టు చేసిన వేల మంది ఉగ్రవాదులను యూనుస్ ప్రభుత్వం రిలీజ్ చేసినట్లు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం లష్కరే తోయిబా స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు. బంగ్లా ఉగ్రవాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోందన్నారు.