1908 తర్వాత అతి తక్కువ వర్షపాతం
భారత వాతావరణ విభాగం వెల్లడి
రాష్ట్రంలోనూ భానుడి భగభగలు
43.2 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత గా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిం ది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతం లో లోటు ఏర్పడిందని, అందుకే ఉత్తర, దక్షిణ ప్రాం తాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. ఈ ఏడాది మార్చిలో సరాసరి 8.9 మి.మీ. వర్షపాతం నమోదైందని, అది సాధారణం కన్నా 71 % తక్కువని తెలిపింది. 1901 మార్చి నుంచి ఇంత తక్కువ నమోదు కావడం ఇది మూడోసారని చెప్పిం ది. మార్చిలో సగటున 33.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 122 ఏండ్లలో ఇదే తొలిసారని చెప్పింది.
భానుడి భగభగ..
రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటుతుండటంతో ఇండ్ల నుంచి బయటికొచ్చేందుకు జనం జంకుతున్నారు. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఆది, సోమవారాల్లో కూడా ఇలాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల లోపు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, శనివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్, ఆదిలాబాద్ పట్టణంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా మవల, భీంపూర్, బీలలో 42.3 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. సంగారెడ్డి కల్హేర్లో 41.2 డిగ్రీలు, మహబూబ్నగర్, వనపర్తిల్లో 40.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.