Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పలు అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమాచారం మేరకు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
సభ అజెండా, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నది. అలాగే, సభలో పలు కీలకమైన బిల్లును ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నం సన్నాహాలు చేస్తుందని భావిస్తున్నారు. భేటీలో పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా జరిగేందుకు పలుమంత్రిత్వశాఖల సమన్వయంపై సైతం చర్చించినట్లు తెలుస్తున్నది. అయితే, సమావేశం ఎజెండాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న విదేశీ పర్యటకు బయలుదేరుతారు. ఈ నెల 23 నుంచి 24 వరకు బ్రిటన్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 25, 26 తేదీల్లో మాల్దీవులకు వెళ్తారు.