సూర్యాపేట, మార్చి 18 : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గురువారం సూర్యాపేటలో తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్‌పై, అమెరికా ఇజ్రాయెల్ దాడులు- దాని పర్యవసానాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరక్కుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది పౌరులను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమెరికా సామ్రాజ్యవాదానికి అంతం లేకుండా పోతోందని, గత నెలలో వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి న్యూయార్క్‌లో నిర్బంధించిందని, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిందన్నారు. ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినా భారత ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. అమెరికాకు భయపడే మోదీ నోరు మెదపడంలేదన్నారు.
యుద్ధం వల్ల పశ్చిమాసియాలో పని చేస్తున్న కోటి మంది భారతీయులకు ఉపాధి పోయే అవకావం ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మహిళలకు సంపూర్ణ స్వరాజ్యం రావాలని ఆమె తపించేవారని, ఆ దిశగా అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముల్కలపల్లి రాములు, నాగరపు పాండు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.