న్యూఢిల్లీ: ఈసారి వర్షాకాలం ముందే రానున్నది. మే 27వ తేదీన నైరుతీ రుతుపవనాలు(Monsoon) కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఒకవేళ అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే, అప్పుడు 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతీ కేరళను తాకినట్లు ఐఎండీ డేటా ప్రకారం తెలుస్తున్నది.
సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి ఆ రుతుపవనాలు వెళ్లిపోతాయి.
2025 వర్షాకాలంలో.. సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లో ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఎల్ నినో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొన్నది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం నార్మల్ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు.