న్యూఢిల్లీ, జూన్ 1 : మరో రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సవరించిన అంచనా వెల్లడించింది. సాధారణంగా ఈ రుతుపవనాల కాలం జూన్ 1వ తేదీన ప్రారంభమవుతుంది. రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ కాలంలో నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో, అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాల్లో కూడా ఈ పురోగమనం జరుగవచ్చని ఐఎండీ అంచనా వేసింది. మే 26న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది.
అయితే రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో అది వచ్చే వారంలో జరుగవచ్చని ఆ శాఖ మే 29న పేర్కొన్నది. గతవారం తన సవరించిన అంచనాలో ఈ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం భారతదేశం తన దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో 90 శాతం వర్షపాతాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఒక రుతుపవన కాలంలో ఎల్పీఏ 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని ఐఎండీ లోటుగా వర్గీకరిస్తుంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడానికి ఒక కారణం ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కావచ్చు. దీనివల్ల దేశంలో రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. జూన్లో ఎల్ నినో పరిస్థితులు బలహీనంగా ఉన్నాయని, సెప్టెంబర్లో మధ్యస్థం నుండి బలంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నది.